Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ముచ్చట్లలో తన రాబోయే చిత్రం ‘రణబాలి’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో సినిమాలో అందరినీ ఆకట్టుకునే సీక్రెట్ సీన్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లలో వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ క్వశ్చన్ & ఆన్సర్ సెషన్‌లో ఓ నెటిజన్ “రణబాలి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి” అని అడగ్గా, రష్మిక ఏమాత్రం తడుముకోకుండా “ఒకేసారి మనసును హత్తుకుంటూనే, మరోవైపు గుండె పగిలే భావోద్వేగాన్ని పంచే అద్భుతమైన కథనం” అంటూ తనదైన శైలిలో వర్ణించింది. ఈ మాటలతోనే సినిమాలో ఏ స్థాయిలో డ్రామా, ఎమోషన్స్ ఉండబోతున్నాయో స్పష్టమవుతోంది.
మరో అభిమాని షూటింగ్ మొత్తంలో మీ ఫేవరెట్ సీన్ ఏది అని అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన రిప్లై సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. “సినిమాలో నాకిష్టమైన సన్నివేశం అంటే.. రణబాలి, జయమ్మలకు పెళ్లి జరిగిన వెంటనే వచ్చే సీన్. అది అత్యంత హాస్యభరితంగా, కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు ఆ సన్నివేశం విపరీతంగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షూట్ చేస్తున్నంత సేపూ మేము కూడా ఎంతగానో నవ్వుకున్నాం” అంటూ అసలు గుట్టు విప్పేసింది. పెళ్లి దుస్తుల్లో సాంప్రదాయబద్ధంగా కనిపించిన ఆమె లుక్ ఇప్పటికే ఆకట్టుకోగా, కథలో పెళ్లి తర్వాత సాగే ఆ కామెడీ ట్రాక్ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

