బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయ్యారు. ‘ది బిగ్ పిక్చర్’ అనే సరికొత్త రియాలిటీ షోను నిర్వహించనున్నారు. కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుండగా… వూట్, జియో స్ట్రీమింగ్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. “బిగ్ పిక్చర్” అనేది విజువల్-బేస్డ్ రియాలిటీ షో. అందులో పోటీదారులు బహుమతిగా డబ్బును గెలుచుకోవడానికి 12 దృశ్య-ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వారికి మూడు లైఫ్‌లైన్‌లు ఉంటాయి. ఈ ప్రదర్శన విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. షో ఇంటరాక్టివ్ ఫార్మాట్ లో రూపొందిన కారణంగా పోటీదారులు వారి ఇళ్ళ వద్ద కూర్చుని ఆట ఆడి డబ్బును గెలుచుకోవచ్చు. బనిజయ్ ఆసియా, ఈటీవీ స్టూడియోస్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బి.వి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. రణవీర్ పై ఇప్పటికే ప్రమోషనల్ టీజర్ల చిత్రీకరణ జరిగిందని, త్వరలోనే షో ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
Read Also : ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్
ఈ విషయం గురించి తన అధికారిక ప్రకటనలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ “కళాకారుడిగా నా ప్రయాణంలో సరికొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు. భారతీయ సినిమా నాకు చాలా ఇచ్చింది. ఇది నటుడిగా నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి నాకు ఒక వేదిక. భారత ప్రజల నుండి అపారమైన ప్రేమను పొందడం నా అదృష్టం. ఇప్పుడు కలర్స్ “ది బిగ్ పిక్చర్”తో నా టెలివిజన్ అరంగేట్రం ద్వారా చాలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రీతిలో బుల్లితెర ప్రేక్షకులతో కూడా కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాను. భారతదేశాన్ని ఈ తరం క్విజ్ షోకు పరిచయం చేయాలనే ప్రతిపాదన నాకు నచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు.