Site icon NTV Telugu

Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ భావోద్వేగ పోస్ట్ వైరల్!

Ranabali

Ranabali

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి రూపొందుతోంది. ఇందులో రణబాలి పాత్రలో విజయ్, జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. నిజ జీవితంలో విజయ్-రష్మిక కలిసి ఏడడుగులు వేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘రణబాలి’ యూనిట్ పెళ్లి పాటని విడుదల చేసింది.

ఇక డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ రణబాలికి సంబంధించి ఓ వెడ్డింగ్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వెడ్డింగ్ పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో చెబుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అది సాధారణ పోస్టర్ కాదని, ఓ నిజమైన క్షణాన్ని బంధించిన దృశ్యమని తెలిపారు. తన తల్లిదండ్రులు, తాతముత్తాతల పాత ఫోటోలంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉండేదని.. ఆ కాలం ఫోటోలలో పోజులు లేని సహజత్వం, నిజాయితీ కనిపిస్తాయని చెప్పారు. అదే సహజత్వాన్ని రణబాలి మూవీలో చూపించడమే తన లక్ష్యమని రాహుల్‌ వెల్లడించారు.

‘1800 చివరి కాలంలో గ్లామర్‌ లేని జీవనశైలి ఉండేది. కానీ ఆ కాలంలోని వివాహాలకు గౌరవం, విలువ ఉండేదది. రణబాలి షూటింగ్ రోజు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు పెళ్లి వేషధారణలో సెట్లోకి వచ్చినప్పుడు వాతావరణమే మారిపోయింది. వారు నటులు లాగా కాకుండా.. నిజంగా ఆ కాలం నాటి వరుడు-వధువుల్లా కనిపించారు. ఎలాంటి ప్రత్యేక లైటింగ్ లేకుండా, స్టైలిష్ పోజులు లేకుండా సాధారణ బ్యాక్‌డ్రాప్‌తో షూటింగ్ చేయాలనిపించింది. ఇద్దరూ తమ క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమై కాలాన్నే మరిపించారు. ఆ ఫోటో చూసినప్పుడు గత జీవితంలోని పెళ్లి జ్ఞాపకం లాగా అనిపిస్తుంది. సినిమా, జీవితం కొన్ని సందర్భాల్లో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ అనుభూతినే ఈ పోస్టర్ ఆడిస్తుంది. శాశ్వతమైన బంధాలు కాలాన్ని మరపిస్తాయి. అదే భావోద్వేగం రణబాలి మూవీకి బలమైన మూల స్తంభం’ అని డైరెక్టర్ రాహుల్‌ సాంకృత్యన్‌ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం రణబాలి పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Exit mobile version