బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎపిక్ డ్రామా ‘రామాయణ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో రూపొందిన ఈ అద్భుత ఘట్టానికి సంబంధించి తొలి రివ్యూలు బయటికొచ్చేశాయి. అయితే అందరి దృష్టి రాముడి మీద ఉంటే.. ఇక్కడ మాత్రం ‘రావణాసురుడు’ షో మొత్తాన్ని తన వైపుకు తిప్పేసుకున్నాడు. మొన్నటి వరకు ‘టాక్సిక్’ సినిమా విషయంలో తీవ్ర విమర్శలు, నెగెటివిటీ ఎదుర్కొన్న యష్.. ఇప్పుడు ‘రామాయణ’తో మైండ్ బ్లోయింగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్‌ను మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదని రావణుడి పాత్రతో మరోసారి నిరూపించాడు. ఒకరకంగా సినిమాలో యష్ యాక్టింగ్ వేరే లెవెల్ అని, రామాయణంలో షో స్టీలర్‌గా నిలిచాడంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు రాముడిగా రణ్‌బీర్ కపూర్ తన అమాయకత్వం, హుందాతనంతో మెప్పించగా.. సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ ముక్తకంఠంతో చెబుతున్నారు. మేకర్స్ సృష్టించిన గ్రాండ్ వరల్డ్ బిల్డింగ్, పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ‘రావణుడు వర్సెస్ జటాయువు’ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్యూర్ సినిమాటిక్ బ్రిలియన్స్ అని, గూస్బంప్స్ గ్యారెంటీ అని చెబుతున్నారు. అయితే నిజానికి సీతను రావణుడు అపహరించడంతో ఈ మొదటి భాగాన్ని ముగించగా ఈ భాగానికి రావణుడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లభించింది. అలానే యష్ తనదైన స్క్రీన్ ప్రేజేన్స్ తో కొన్ని చోట్ల రణబీర్ ను సైతం డామినేట్ చేశారు.

