తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లుగా ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ.. బాలీవుడ్‌లో మాత్రం వరుస చిత్రాల్లో బీజీ అయ్యింది రకుల్. ఈ బిజీ సినిమాల్లో ఆమెతో ఎక్కువగా రిపీట్ అవుతున్న నటుల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ అనే చెప్పచ్చు.
సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘అయ్యారే’, ‘మార్జవాన్’ చిత్రాల్లో నటించిన రకుల్.. అజయ్ దేవగణ్‌తో ‘దే దే ప్యార్ దే’, ‘రన్ వే 34’ చిత్రాల్లో కనిపించింది. వీరిద్దరితో ఆమె ప్రస్తుతం కలిసి నటిస్తున్న సినిమా ‘థాంక్ గాడ్’. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా దీపావళి పండక్కి వాయిదా పడింది.
టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంద్ర కుమార్ రూపొందిస్తున్నారు. తోటి నటుల గురించి రకుల్ మాట్లాడుతూ…‘సిద్ధార్థ్ మల్హోత్రా మంచి మిత్రుడు. ఇద్దరిదీ ఢిల్లీ కావడం మా మధ్య అనుబంధానికి మరో కారణం. అతనితో సరదాగా ఉంటాను. అజయ్ దేవగణ్ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన నటుడు. కలిసి నటించేప్పుడు సలహాలు ఇస్తే కాదనడు. అతని బుర్రే బుర్ర. వాయు వేగంతో ఆలోచనలు చేస్తుంటాడు’ అని చెప్పుకొచ్చింది రకుల్.