తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. బాహుబలి లాంటి జానపద చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించేలా ఆయన తీసిన విధానం, దాన్ని మార్కెటింగ్ చేసుకున్న విధానం ఎప్పటికీ ఒక రూట్ మ్యాప్ అని చెప్పాలి. అలాంటి ఆయన, ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిన్న, పృథ్వీరాజ్‌కు సంబంధించిన పాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో పృథ్వీరాజ్ ఒక చక్రాల కుర్చీలో కూర్చొని ఉండగా, దాని వెనుక చేతులు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకేముంది, సోషల్ మీడియా వీరులు, అబ్బో, రాజమౌళి మళ్ళీ కాపీ కొట్టి దొరికేశాడు అంటూ, సూర్య నటించిన 24 సినిమాలోని సూర్య ఫోటోతో పాటు, ఒక కార్టూన్‌లోని ఫోటో పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు.
Also Read :Chikiri Chikiri: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే!
నిజానికి, రాజమౌళి లాంటి దర్శకుడు ఒక పాత్ర క్రియేట్ చేశాడంటే, దాని వెనుక ఎంతో మేధో మథనం ఉంటుంది. బయటకి కనిపించేది రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ మాత్రమే కావచ్చు, కానీ వారి టీంలో ఎన్నో సినిమాల అనుభవం ఉన్న రైటర్లు, దర్శకులు పనిచేస్తూ ఉంటారు. వారంతా చర్చించుకోకుండానే ఆ పాత్రను డిజైన్ చేసి ఉంటారా? సినిమాల్లో అ ఆ లు కూడా రాని వాళ్ళు, ఒక సినిమాలో పోలిన పాత్రను పోలి ఉంటే, దాన్ని వెంటనే ట్రోలింగ్ మెటీరియల్‌గా వాడుకుని, ఏదో సాధించేసాం, మేమేదో కనిపెట్టేసాం అనే ఫీలింగ్‌లోకి వెళుతున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక సినిమాలో కలెక్టర్ పాత్రలో ఒక హీరో నటిస్తే, ఇక ప్రపంచంలో ఇక ఏ హీరో, ఏ సినిమాలోనూ కలెక్టర్ పాత్రలో నటించకూడదు అన్నట్టుగా ఉంది వీరి పరిస్థితి. నటిస్తే, దాన్ని కూడా కాపీ అనేలా ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇలా ట్రోల్ చేసేవాళ్ళే మొదటి రోజు, మొదటి ఆట టికెట్లు కొనుక్కుని మరీ వెళ్లి సినిమా చూసి వస్తారు. దట్ ఈజ్ రాజమౌళి.