నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయకుడి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో కలిసి నిర్మించారు. ఇంతకుముందు సునీల్ ‘ఓం భీమ్ బుష్’ (శ్రీ విష్ణు), ‘మా నాన్న సూపర్ హీరో’ (సుధీర్ బాబు) వంటి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సందర్భంగా సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో జరిగిన సంభాషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Film Updates : విషు పండుగ కానుకగా తమిళ్, మలయాళ సినిమాల స్పెషల్ అప్డేట్స్
సినిమా విడుదల తేదీల విషయంలో ఓటీటీల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురవుతోందని సునీల్ అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ తెలుగు సినిమాల మీద ఓటీటీల ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. విడుదల తేదీలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఓటీటీలపై ఆధారపడి సినిమా తీస్తే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. వారు కొన్ని ఎంచుకున్న సినిమాలను మాత్రమే కొంటారు, తమ షెడ్యూల్‌కు అనుగుణంగా విడుదల చేయమని చెబుతారు. ఉదాహరణకు, వేసవి సీజన్‌లో విడుదల చేయకుండా నాలుగైదు నెలల తర్వాత రిలీజ్ చేయమంటే సినిమాకి ఉపయోగం ఏముంటుంది? ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విషయంలో ఓటీటీలతో చర్చలు జరిగాయి, కానీ వారు చెప్పిన తేదీలకు కట్టుబడాలని నేను భావించలేదు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మకుండా థియేటర్లలోనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. థియేటర్లలో విజయం సాధించగలమనే నమ్మకం ఉంటేనే ఏ నిర్మాత అయినా సినిమా తీయాలి. ఓటీటీల మీద ఆధారపడటం సరికాదు అన్నారు. కొందరు నిర్మాతలు ఓటీటీలు ఆఫర్ చేసే డబ్బులకు ఆకర్షితులై నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? అని అడిగితే ఓటీటీలు ఇచ్చే డబ్బు చాలా సందర్భాల్లో సరిపోదు. ఉదాహరణకు, సినిమా బడ్జెట్‌కు వడ్డీలు లెక్కేస్తే, వారు ఇచ్చే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అది నిర్మాతలకు నష్టమే. థియేటర్లలో సినిమా హిట్ అయితే, ఓటీటీ గురించి ముందుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ముందుగా సినిమాను ప్రేక్షకులకు చేర్చడంపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.