ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దేశభక్తిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. జులై 25న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘సర్‌జమీన్’ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ దేశాన్ని ప్రేమించడం పై తన భావాలను వెల్లడించారు. “నిజమైన దేశభక్తి అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ‘నేను భారతీయుడిని’ అని గర్వంగా చెప్పడమే” అని పృథ్వీరాజ్ తెలిపారు. తనది కేరళ అయినా, మలయాళం మాట్లాడినా, మహారాష్ట్ర వాడు అయినా హిందీ మాట్లాడినా.. వీటన్నిటికంటే ముందు మనమంతా భారతీయులమనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read : Crocs : మీ పిల్లలకు క్రోక్స్ చెప్పులు వాడుతున్నారా ?
ఎవరైనా “ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగితే తన ఊరు కాదు, భారత్ నుంచి వచ్చానని చెప్పడంలో గర్వం ఉంది అని పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, కాజోల్ భార్యగా, సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా కశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. ఆర్మీ ఆఫీసర్ల సాహసాలు, దేశానికి చేసిన త్యాగాల్ని చూపించేందుకు రూపొందిన ఈ చిత్రం 25 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ద్వారా పృథ్వీరాజ్ నటనతో పాటు దేశభక్తిని కూడా చాటిచెప్పబోతున్నారనడంలో సందేహం లేదు.