తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ ‘మా’ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు మాత్రమే పోటీ పడేవి. కానీ ఈసారి మాత్రం సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. దీనితో ఈసారి పోటీ ఉత్కంఠభరితంగా మారింది. ఇక ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉండగా, మంచు విష్ణుకు సీనియర్ నటులు, నందమూరి కుటుంబ సభ్యుల మద్దతు ఉందని వార్తలు వస్తున్నాయి.
Read Also : రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)
ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ “మొదటి సారి మీడియాను చూసి భయం వేస్తోంది. ‘మా’ది చిన్న అసోసియేషన్. దీనిపై వస్తున్న ఊహాగానాలు చూసి భయం వేసింది. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ ఇది. కానీ అందరికి ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. ఇక్కడ ఏదో జరుగుతోంది. చూస్తూ ఉరుకోలేం… ‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో నిలబడాలని నిన్న మొన్న ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఏడాదిగా ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ చేశాము.” అంటూ తాను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం గురించి చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ “కళ్ళముందు ఉన్న వాళ్ళు సగం మందే… వాళ్ళను ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దు. మేము సైలెంట్ గా వర్క్ చెయ్యాలనుకుంటున్నాం. మా ప్యానల్ లో గట్టిగా మాట్లాడే వాళ్ళున్నారు. అయితే చిరంజీవి గారిని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు?” అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. మరోవైపు ప్రకాష్ రాజ్ వేరే పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి ఒప్పుకోమని అంటున్నారు కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు.