Prabhas: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ‘సింగ్ గీతం’ సినిమాను చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం డార్లింగ్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి కాల్ చేసి పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఎమోషనల్ అవుతూ.. “సింగీతం గారు జీనియస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరో చెట్టు దగ్గరికి వెళ్లే ఒక ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గతంలో సింగీతం గారు ‘మయూరి’ సినిమాలో నిజంగానే కాలు లేని అమ్మాయిని పెట్టి భరతనాట్యం చేయించి ఎలాగైతే ఎమోషన్ పండించారో.. ఇందులోనూ పాటల ద్వారానే ఏడిపించేశారు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. వెంటనే సింగీతం గారికి ఒక వాయిస్ మెసేజ్ పెడుతూ.. “సార్, ఇప్పుడే సినిమా చూశాను. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఎవర్ సార్.. హాట్సాఫ్” అని తన గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సినిమా అంతా మాటలు లేకుండా కేవలం పాటలతోనే సాగడంపై ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అసలు సింగీతం గారు ఎలా ఆలోచిస్తారు అని నాగ్ అశ్విన్‌ను అడిగారు. దానికి నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. “సాధారణంగా ట్యూన్ వచ్చాక లిరిక్స్ రాస్తారు. కానీ సింగీతం గారు మొదట డైలాగ్స్ తరహాలో లిరిక్స్ రాసి, ఆ తర్వాత ట్యూన్ చేశారు. ఆయనే స్వయంగా ఒకటిన్నర గంటల పాటు ప్రతి సీన్‌ను పాడుతూ మాకు నర్రేషన్ పంపించారు. మొదట్లో మాకు ఇది అర్థం కాలేదు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆ సీన్లను ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. సింగీతం గారితో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు అంతే ముఖ్యం” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

