మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా ఎన్నికల సెగ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. కావాలనే తమ సభ్యులపై దాడులు చేశారని అన్నారు.
ఎన్నికల రోజు సీసీ పుటేజీలను తమకు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు ప్రకాశ్‌రాజ్. అందుకు ఎన్నికల అధికారి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా… సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఖండించారు జూబ్లిహిల్స్ పోలీసులు. స్కూల్లో ఉన్న సర్వర్ రూంకి తాళం ఉందని సెలవులు కావడంతో తాళం ఇచ్చే పరిస్థితి లేదన్నారు..మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ విజయం సాధించడంతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు మంచు విష్ణు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొంత మంది సీనియర్ నటులపై పరోక్ష ఆరోపణలు చేశారు మోహన్ బాబు. విష్ణు ప్యానల్ గెలుపుతో తమ పదవులకు రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్ తాను రాజీనామాచేసి తన ప్యానల్ సభ్యులతో కూడా రాజీనామా చేయించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా… హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బంగారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణుతో పాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ స్టేజీ మీదకు వచ్చే సమయంలో అంతా నిలుచుని నమస్కారం చేశారు… విష్ణు మాత్రం తన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో పక్కనే ఉన్నా… చూసిచూడనట్లు వ్యవహరించారు పవన్ కల్యాణ్.