93వ అకాడమీ అవార్డులలో డైరెక్ట్ గా భారతీయ చిత్రాలకు అవార్డులు రాకపోయినా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైన ‘మై ఆక్టోపస్ టీచర్’కు ఇండియాతో సంబంధం ఉంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్ స్వాతి త్యాగరాజన్ ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గానూ, ప్రొడక్షన్ మేనేజర్ గానూ వ్యవహరించారు. ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీని పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్ దర్శకత్వంలో క్రెయిగ్ ఫోస్టర్ నిర్మించారు. ఫోస్టర్ భార్య అయిన స్వాతి ఈ చిత్ర నిర్మాణంలో తనవంతు సహకారం అందించారు. ఇక ఇటీవల కన్నుమూసిన ఇర్ఫాన్ ఖాన్, ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియాను కూడా ఆస్కార్ వేదికపై స్మరించుకున్నారు. ప్రతి యేడాది మూడు నిమిషాల పాటు మనల్ని వదిలి వెళ్ళిపోయిన సినీ ప్రముఖులను ఆస్కార్ వేదికపై ‘ఇన్ మెమోరియమ్’ పేరుతో స్మరించుకుంటారు. అలా ఈసారి ఇర్ఫాన్, భాను లను అకాడమి అవార్డుల ప్రదానోత్సవ వేదికపై తలుచుకున్నారు.