(జూన్ 18న ‘ఓ మనిషీ! తిరిగిచూడు!!’కు 45 ఏళ్ళు)
దర్శకరత్న దాసరి నారాయణరావు సామాన్యుల పక్షం నిలచి అనేక చిత్రాలను తెరకెక్కించారు. అలా రూపొందించిన ప్రతి సినిమాలోనూ సగటు మనిషి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చూపిస్తూ సాగారు. ‘వెట్టిచాకిరి’పై పోరాటం సాగించాలి అని నినదిస్తూ తరువాత ఎన్ని సినిమాలు రూపొందినా, వాటికి ప్రేరణగా నిలచిన చిత్రం దాసరి రూపొందించిన ‘ఓ మనిషీ తిరిగిచూడు!’. 1977 జూన్ 18న ‘ఓ మనిషీ తిరిగిచూడు!’ చిత్రం జనం ముందు నిలచింది.
తెలుగునేలపైని ఓ మారుమూల పల్లెలో ఓ కామందు వద్ద ఓ కుటుంబం వెట్టి చాకిరీ చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు, వారి ముగ్గురు కొడుకులు ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి దాకా యజమాని పొలంలోనూ, కల్లంలోనూ, ఇంట్లోనూ ఇలా ఏ పనిచేయమన్నా ఎదురు మాట్లాడకుండా చేస్తూ ఉంటారు. వారి బతుకులు చూసిన కామందు కూతురు సైతం తండ్రిని అసహ్యించుకుంటుంది. ఆ అన్నదమ్ములను అడ్డు పెట్టి యజమాని పేద ప్రజల వద్ద ఇల్లు కట్టిస్తానని డబ్బులు నొక్కేస్తాడు. తరువాత ఆ ఆఫీసు బోర్డు తిప్పేస్తాడు.
దాంతో జనం అన్నదమ్ములను అనుమానిస్తారు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడు కన్నవారి వద్దే ఉంటాడు. వారికి విధవరాలయిన ఓ ధనవంతుల అమ్మాయి ఆసరాగా నిలుస్తుంది. ఆమె వారితోనే ఉండాలని ఆశిస్తుంది. ఆమె అన్నయ్య అనునయించి ఇంటికి తీసుకువెళతాడు. ఓ రోజు ఆమె కోనేటిలో శవమై తేలుతుంది. అది చూసిన ముగ్గురు అన్నదమ్ముల తల్లి పిచ్చిదవుతుంది. కేసుల్లో ఇరికించి ముగ్గురు అన్నదమ్ములను ఊచలు లెక్క పెట్టిస్తారు ధనవంతులు. తండ్రి మోసాలను బయట పెట్టి, వారిని విడిపించుకొని వస్తుంది కామందు కూతురు. అయితే చెల్లెలిని చంపేసిన మరో ధనికుని, వాడి బంధువులను పిచ్చెక్కిన తల్లి కట్టెతో కొడుతుంది. ఆమెను చంపేస్తారు. అది చూసిన అన్నదమ్ముల తండ్రి కొట్టినవారిలో ఒకడిని నరికేస్తాడు. కొడుకులు జైలు నుండి విడుదలై ఊరికి వస్తూండగా, వారి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు పోతుంటారు. వారి తండ్రి “ఈ సంకెళ్ళు నాకు కాదురా… వెట్టిచాకిరికి…”అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో మురళీమోహన్, మోహన్ బాబు, ఈశ్వరరావు, జయసుధ, కె.విజయ, నిర్మలమ్మ, పేకేటి, బెనర్జీ, గోకిన రామారావు, రాజు, జయవాణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు సమకూర్చారు. దిడ్డి శ్రీహరి రావు నిర్మించారు. రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చగా, డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఇందులోని “ఓ మనిషీ… తిరిగిచూడు…”, “బండెనక బండి కట్టి జోడెడ్ల బండి కట్టి…”, “ముందుకు ముందుకు…”, “తిప్పు తిప్పు తిప్ప తీగె…” అంటూ మొదలయ్యే పాటలు జనాన్ని ఆకట్టుకున్నాయి.
ఇందులో ముగ్గురు అన్నదమ్ములుగా నటించిన మురళీమోహన్, మోహన్ బాబు, ఈశ్వరరావుకు మంచి పేరు లభించింది. బుర్రకథ చెప్పే బెనర్జీకి ఇందులో విలన్ గా కీలక పాత్ర ఇచ్చారు. జయసుధ అతని కూతురుగా నటించారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేవని, పైగా ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా కావడం వల్ల విడుదలకు అంత త్వరగా నోచుకోలేదు. ఈ చిత్రం దర్శకునిగా దాసరికి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత వచ్చిన “యువతరం కదిలింది, మా భూమి” వంటి చిత్రాలను చూస్తే ఇందులోని కొన్ని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి.