యంగ్ డైరెక్టర్ వెంకి కుడుముల “చలో” చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం ఆయనకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత నితిన్ తో కలిసి ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కించాడు వెంకీ. ఈ చిత్రం 2020లో వచ్చిన అతి తక్కువ బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలిచింది. “భీష్మ” తరువాత వెంకీ కుడుములు తన తరువాత ప్రాజెక్ట్ ను ఓకే చేయలేదు. మరోవైపు లాక్ డౌన్ కూడా ఉండడంతో వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ తో వెంకీ రెండో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. “భీష్మ” ప్రమోషన్ సమయంలో వెంకీతో మరో సినిమా చేస్తానని నితిన్ హామీ ఇచ్చాడు. ఈ వార్తలు చూస్తుంటే నితిన్ తన హామీని నిలబెట్టుకున్నట్టు తెలుస్తోంది. ‘భీష్మ’ వంటి హిట్‌ను అందించినందుకు వెంకీకి లగ్జరీ కారును బహుమతిగా నితిన్ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ కోసం వెంకీ ఒక చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కాని దీనిపై స్పష్టత లేదు. ఈ మధ్య వరుణ్ తేజ్, నాగ చైతన్యలతో వెంకీ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కరోనా మహమ్మారి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత నితిన్, వెంకీ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.