మెగా స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో, యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో నిర్మించిన సెట్‌లో ఈ ఘటన సంభవించింది.
అయితే సినిమాలోని కీలకమైన సముద్రం సన్నివేశాలు షూట్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ సెట్ వేశారు. ఆ సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో, ఒక్కసారిగా నీళ్లన్నీ సెట్‌లోకి దూసుకొచ్చాయి. నీళ్ల వేగానికి లొకేషన్‌లో ఉన్న సిబ్బందితో కెమెరాలు, ఇతర వస్తువులు కొట్టుకువచ్చాయి. దీంతో సెట్‌లో ఉన్న కొంత మంది సిబ్బందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇందులో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేయగా, ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారట. ప్రజంట్ ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, గాయపడిన వారు త్వరగా సురక్షితంగా కోలుకోవాలని, మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్ కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.