నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉన్న అభిరుచి అందరికీ సుపరిచితం. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. తాజాగా, ఈ సినిమా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది.
Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న ‘యముడు’ టీజర్..
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక ఉన్నతిని ప్రోత్సహించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా, దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. గద్దర్ పేరిట ఇవ్వబడుతున్న ఈ అవార్డులను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రెండు రాష్ట్ర అవార్డులను సాధించినందుకు నిహారిక సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read:Sukumar : ఆ మూడు సినిమాలు చేసి ఉంటే సినిమాలు ఆపేసేవాడిని..
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, “‘కమిటీ కుర్రోళ్ళు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమాను గుర్తించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, జ్యూరీ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, మిగతా విజేతలందరికీ నా అభినందనలు” అని తెలిపారు.
ఈ విజయంపై యదు వంశీ స్పందిస్తూ, “యువ, నూతన ప్రతిభను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డులు యువ నటులు, చిత్రనిర్మాతలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఈ గౌరవాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, జయసుధ గారు, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు స్ఫూర్తినిస్తుంది, ఇంకా అర్థవంతమైన కథలను చెప్పేందుకు ప్రేరణనిస్తుంది. మిగతా విజేతలకు అభినందనలు” అని అన్నారు.