Keerthi Suresh: ఇవాళ నెటిజన్లు చాలా షార్ప్ గా ఉన్నారు. వాళ్ళ ఐక్యూ నంతా సోషల్ మీడియాలో ప్రదర్శించేస్తున్నారు. ఒక హీరో ఓ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన తర్వాత, ఆ క్యారెక్టర్ మా హీరోకి పడి ఉంటేనా… అంటూ గొప్పలు చెప్పుకునే ఫ్యాన్స్ మనకు చాలా మందే సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అలానే ‘ఫలానా సినిమాలో ఫలానా క్యారెక్టర్ ఫలానా నటి చేసింది కానీ… ఆమె బదులు ఈమె చేసి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేద’ని గప్పాలు కొట్టే వారికీ కొదవలేదు. ‘మహానటి’ మూవీ విడుదలైన తర్వాత అందులో కీర్తి సురేశ్ నటనను మెచ్చుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సావిత్రి అంత లావుగా కీర్తీ లేకపోయినా… తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందనే ప్రతి ఒక్కరూ అన్నారు. అంతేకాదు… ‘మహానటి’లో సావిత్రి పాత్రకు జీవం పోసి ఏకంగా జాతీయ అవార్డునే కైవసం చేసుకుంది కీర్తి సురేశ్. అయితే… ఆమె తోటి హీరోయిన్ల అభిమానులు మాత్రం కీర్తికి అంత పేరు రావడాన్ని సహించలేకపోయారు. ఇప్పటికీ ఏదో రూపంలో తమ మనసులోని అక్కసును బయట పెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పూజా హెగ్డే హవా బాగానే సాగింది. ఆమె ఖాతాలో వరుస చిత్రాలు పడటమే కాదు… అందులో కొన్ని మంచి విజయాన్ని కూడా సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత పూజను బుట్టబొమ్మ అని ముద్దుగా పిలుచుకోవడం కూడా మొదలైంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ నెటిజన్… ” ‘మహానటి’ మా పూజకు పడుంటే!?’ అంటూ ఓ ప్రశ్నను సోషల్ మీడియాలో సంధించాడు. అంతే వేల సంఖ్యలో దానికి కామెంట్స్ వచ్చేశాయి. చిత్రం ఏమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ అందులో లేదు. ‘కీర్తి సురేశ్ కూడా ఏమంత గొప్పగా ఆ పాత్ర చేయలేదు’ అంటూ ఒకరో ఇద్దరూ వ్యాఖ్యానించారు అంతే!! మిగిలిన వాళ్ళ కామెంట్స్ చదివితే… పాపం పూజా హెగ్డే ‘నేను మరీ ఇంత బ్యాడ్ యాక్ట్రస్ నా!?’ అని సందేహపడాల్సి వచ్చేది. కొందరైతే రకరకాల ఎమోజీస్ పెట్టి యాక్ అనేశారు. మరికొందరు బ్రహ్మానందం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ను ఉపయోగిస్తూ తమ ఫీలింగ్స్ తెలిపారు. ‘చూడలేక చచ్చుండేవాళ్ళమ’ని కొందరు, ‘ఆ సినిమా పూజకు పనికి రాని పువ్వు అయ్యుండేద’ని మరి కొందరు, ‘జెమినీ గణేశన్ క్యారెక్టర్ గురూజీ చేసేవారేమో’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి, ‘ఒక కంటి నుండి నీరు రావాలి అంటే… నవరంధ్రాల నుండి తెప్పించేది’ అని తేల్చేశారు. అంతేకాదు… ”’ప్రాజెక్ట్ కె’ ఉండేది కాద’ని కూడా ఇంకొందరు కామెంట్ చేయడం విశేషం. ఏదేమైనా… ఒకే ఒక్క ప్రశ్న వేలాది మందిలోని క్రియేటివిటీని భలే బయటపెట్టింది.