‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేదని విమర్శించడంతో అసలు గొడవ మొదలైంది. వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ధనుష్ తో పోల్చడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వెంకటేశ్ నటన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారంటూ మరి కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. చివరకు ఈ వివాదం ధనుష్ వర్సెస్ వెంకటేశ్ నుండి మారిపోయి కోలీవుడ్ హీరోస్ వర్సెస్ టాలీవుడ్ హీరోస్ అయిపోయింది. విజయ్ గొప్పొడంటే.. ప్రభాస్ గొప్పోడని, మహేశ్ గొప్పోడంటే అజిత్ అంతకంటే గొప్పోడని కోలీవుడ్ – టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరి మించి ఒకరు మీమ్స్ తో దాడులు చేయడం మొదలెట్టారు.
Read Also : చిరంజీవి “లూసిఫర్” కోసం భారీ సెట్స్
వీటన్నింటినీ గమనించిన నటుడు సిద్ధార్థ్… ‘అభిమానుల బుద్ధి మారాలం’టూ హితవు పలుకుతున్నాడు. తెలుగు – తమిళ సినిమా అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడటం మాని తమ దృష్టిని నెట్ ఫ్లిక్స్ మీద ఫోకస్ చేయాలని కోరాడు. వరల్డ్ బెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా మొత్తాన్ని ఒకే గాటన కట్టి నెట్ ఫ్లిక్స్ ఇన్ సౌత్ గా పేర్కొంటోందని సిద్ధార్థ్ వాపోయాడు. ఇక్కడ ఉన్న నాలుగు భాషల చిత్ర పరిశ్రమలకు దేని ప్రత్యేకత దానికి ఉందని, అలా కాకుండా అన్నింటిని ఒకటిగా గుర్తించడం కరెక్ట్ కాదని, ఈ విషయమై నెట్ ఫ్లిక్స్ తో పోరాటం చేయాలని సిద్ధార్థ్ సూచించాడు. సిద్ధార్థ్ కోరిక సమంజసమైనదే అయినా… హీరోల అభిమానులకు అది బుర్రకెక్కినట్టు కనిపించడం లేదు… ఆ పోస్ట్ కింద కూడా మీ కోలీవుడ్ విజయ్ ఫ్యాన్స్ మా ప్రభాస్ ను, మహేశ్ బాబును తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళను కట్టడి చేయండి ముందు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలానే కోలీవుడ్ హీరోల ఫ్యాన్స్ టాలీవుడ్ యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూ మీమ్స్ పెడుతున్నారు.