Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. సినిమా పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ లెక్కలకు మధ్య తేడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా తెలుసని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల వ్యవస్థల కారణంగా సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్‌పుట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సినిమా బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిజంగా ఎంత వసూలు చేసిందో ప్రభుత్వ విభాగాలకు వివిధ మార్గాల ద్వారా తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ కారణంగా సినిమాల వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన పని కాదని అన్నారు.
మరోవైపు సినిమా నిర్మాణంలో ఖర్చులను పెంచి చూపించడం వల్ల కూడా చివరికి నిర్మాతకే నష్టం జరుగుతుందని నాగవంశీ పేర్కొన్నారు. ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్ తగ్గిపోతుందని, అందువల్ల అలా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని అసలు కలెక్షన్లు, ఆదాయ వివరాలు ప్రభుత్వ విభాగాలకు తెలిసిపోతాయని చెప్పారు. గత కొన్నేళ్లలో తన సంస్థపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నాగవంశీ ప్రస్తావించారు. అధికారులు తమ వద్ద ఉన్న సమాచారంతో చాలా విషయాలను ముందుగానే తెలుసుకుంటారని చెప్పారు. కాబట్టి ప్రభుత్వాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదని, దాచిపెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్లు, ఆర్థిక లావాదేవీలపై ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటాయని నాగవంశీ చెప్పుకొచ్చారు. అప్పులు తీసుకుని సినిమాలు నిర్మించడం, వాటిని పూర్తి చేసి విడుదల చేయడం వంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్యే నిర్మాతల ప్రయాణం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

