ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో ట్రాప్ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ రోజు (సోమవారం, నవంబర్ 17) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను నాగార్జున పంచుకున్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
Also Read :The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా!
ఈ సమావేశంలో నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అక్కినేని నాగార్జున, తన కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడిందని స్పష్టం చేశారు. ” మా కుటుంబంలో ఒకరిని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కేటుగాళ్లు ఇబ్బందికి గురిచేసినట్లు” ఆయన తెలిపారు. నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు? అనే చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖుల కుటుంబాలే సైబర్ నేరాల బారిన పడడం పట్ల ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనతో డిజిటల్ మోసాలు మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.