DNK Trailer : ఆన్‌లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి

Donga Na Koduku

Donga Na Koduku

యువతను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి, లోన్ యాప్‌ల ఉచ్చులో పడితే జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే బర్నింగ్ టాపిక్‌ను ఎంచుకుని, దానికి కావాల్సినంత కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సరికొత్త చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ తాజాగా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం యువత ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు ఎలా బానిసలవుతున్నారో ఈ ట్రైలర్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. బెట్టింగ్ వ్యసనంతో లోన్ యాప్‌లలో, చివరకు గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతాడు హీరో. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి ఇంటికొచ్చి వార్నింగ్ ఇవ్వడంతో.. ఆ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేక ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. తన స్నేహితుడితో కలిసి ఏకంగా ధనవంతుల ఇళ్లలోనే దొంగతనాలకు స్కెచ్ వేస్తాడు. అయితే ఈ వరుస దొంగతనాల వెనుక ఏదో బీహార్ ముఠా ఉందని పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టడంతో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఈ అప్పుల పాలైన యువకుడి క్యారెక్టర్‌లో జీవించేశాడు. తనదైన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రతి సీన్‌ను రక్తి కట్టించాడు. సుష్మిత శెట్టి అమాయకపు గర్ల్‌ఫ్రెండ్‌గా క్యూట్‌గా ఆకట్టుకుంది. ఇక హీరో తల్లిదండ్రులుగా సీనియర్ నటులు అలీ, రజిత తమ మార్క్ కామెడీతో చెలరేగిపోగా.. రఘుబాబు, గుండు సుదర్శన్, ప్రియా తదితరులు కీలక పాత్రల్లో అదరగొట్టారు. నేటి జెన్-జెడ్ యువతకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు శ్రీను కంబాల ఈ కథను రాసుకున్న తీరు ఆకట్టుకుంటోంది. ఒక సీరియస్ సామాజిక సమస్యను తీసుకుని, దానికి దొంగతనాల నేపథ్యంలో ఉత్కంఠను, వినోదాన్ని జోడించి కమర్షియల్ ప్యాకేజీగా మలిచారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ నిర్మాణ విలువల మధ్య నిర్మించిన ఈ సినిమాకు సూర్య బాలాజీ విజువల్స్, సింజిత్ యెర్రమిల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో బజ్ క్రియేట్ చేసిన ‘DNK’.. నవంబర్ 13న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ చిత్రం ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.