Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?

Chiranjeevi

Chiranjeevi

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, నైజాం థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రెంట్ విధానాన్ని పక్కన పెట్టి కలెక్షన్లను బట్టి పర్సంటేజ్ శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నైజాం థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ వివాదం విషయంలో చిరంజీవిని కలుస్తామని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో, నేడు (సోమవారం) సాయంత్రం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ వివాదం కారణంగా ‘పెద్ది’ రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురుకాకూడదని ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ మొదట భావించినప్పటికీ.. ఈ సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ‘పెద్ది’ లాంటి భారీ చిత్రాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఈ సమస్యను ఇప్పుడే తేల్చకపోతే భవిష్యత్తులో నిర్మాతలు తమను పట్టించుకోరనే ఆందోళనను ఎగ్జిబిటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని, దీనిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని వారు చిరంజీవిని కోరనున్నారు. గతంలో కూడా చిత్ర పరిశ్రమకు ఎలాంటి కష్టాలు వచ్చినా, వివాదాలు తలెత్తినా చిరంజీవి గారు ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఉన్న ఈ ఇంధన సందిగ్ధతను తొలగించేందుకు ఆయన మధ్యవర్తిత్వం వహించనున్నారని అంటున్నారు.