మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే సందర్భంగా మెగా మహిళా కుటుంబం చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఎక్కువ. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. కళ్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది. నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ .. ‘చిన్నతనంలో నేను ఎక్కువగా పని చేసేవాడిని కాదు. అన్ని పనులు అన్నయ్యే చేసేవారు. నాకు చెప్పిన పనుల్ని కూడా అన్నయ్యకే ఇచ్చేవాడిని. అలా అప్పుడప్పుడు అన్నయ్య చేతిలో నాకు దెబ్బలు కూడా పడ్డాయి. చిన్నప్పుడు మా తమ్ముడు కళ్యాణ్ బాబు చాలా వీక్‌గా ఉండేవాడు. అందుకే మా అమ్మ కళ్యాణ్ బాబు మీద ఎక్కువ కేరింగ్‌గా ఉండేవారు. ఇప్పటికీ కళ్యాణ్ బాబు వస్తున్నాడంటే ఇష్టమైన వంటకాలన్నీ వడ్డిస్తుంటారు. తిండి విషయంలో అన్నయ్య ఏం పెట్టినా సైలెంట్‌గా తినేసేవారు. కానీ నేను మాత్రం ఇంట్లో అల్లరి చేసేవాడిని. కళ్యాణ్ బాబు అయితే నచ్చితే తింటాడు లేదంటే సైలెంట్‌గా వెళ్లిపోతాడు. సైలెంట్‌గానే నిరసన తెలిపేవాడు. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకున్న బాధలన్నీ మాయం అవుతాయి. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో ఉన్నట్టుగా మా అమ్మ దగ్గర ఆ శక్తి ఉంటుంది. మా అమ్మని హగ్ చేసుకుంటే నాకు ఎనలేని ఎనర్జీ వస్తుంది’ అని అన్నారు.
అంజనమ్మ మాట్లాడుతూ .. ‘మా శంకర్ బాబు చిన్నతనం నుంచి ఎక్కువగా కష్టపడ్డాడు. చిన్నప్పుడు అంతా నాతోనే ఉండేవాడు. నాకు పనుల్లో సాయం చేస్తుండేవాడు. ఇంటా, బయట పనులు చేసేవాడు. అందరూ కలిసి ఉండాలి.. అందరితో ప్రేమగా ఉండాలి.. ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి అని నా పిల్లలకు నేర్పించాను. కానీ ఇప్పుడు అంతగా ప్రేమలు కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబాలు కూడా కనిపించడం లేదు. అందరూ కలిసి మెలిసి ప్రేమతో ఉండాలి’ అని అన్నారు.
విజయదుర్గ మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మా మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు.
మాధవి మాట్లాడుతూ .. ‘మా అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు. మా అమ్మ నాకు ఎప్పుడూ అండగా ఉంటారు’ అని అన్నారు.