‘పెదరాయుడు’, ‘దేవి’ వంటి చిత్రాలతో బాలనటుడిగా సుపరిచితుడైన మాస్టర్ మహేంద్రన్, తమిళనాడు గత ప్రభుత్వాలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా రూలింగ్‌లో ఉన్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తీర్చలేని సమస్యలను.. కొత్తగా, మొన్నమొన్నే పదవీ బాధ్యతలు స్వీకరించిన హీరో విజయ్ ఎలా పరిష్కరించగలడు అని ప్రజలను ప్రశ్నించారు. అంతేకాదు, తమిళనాడు ప్రజలు ఆయనకు కాస్త సమయం ఇవ్వాలని, ఓ బిడ్డ పుట్టడానికి కూడా తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన తనదైన శైలిలో తాజా తమిళనాడు రాజకీయాలపై కామెంట్స్ చేశారు. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.
కొన్ని రోజుల క్రితం ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ యువ హీరో.. విజయ్ ప్రభుత్వం వచ్చాక పవర్ కట్స్ ఎక్కువయ్యాయి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, “కరెంట్ పోతే విజయ్ చేతిలో ఏమైనా స్విచ్ ఉంటుందా ఆన్ చేయడానికి?” అంటూ హాస్యాస్పదంగా మాట్లాడారు. అలాగే పవర్ కట్స్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటే సొంతంగా సోలార్ కూడా పెట్టుకోవాలని, విజయ్‌ను విమర్శించే వారికి ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో వైరల్ అయ్యాయి, దాంతో ఈ హీరో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
ఇక ఇవాళ తన తాజా చిత్రం ‘వసుదేవ సుతం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా ఇదే విషయంపై ఓ విలేఖరి ప్రశ్నించగా.. తాను ఇప్పటికీ తన కామెంట్స్‌పై స్టిక్ అయి ఉన్నానని, పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా పరిష్కరించలేని సమస్యలను మొన్నమొన్నే సీఎం అయిన విజయ్ వెంటనే పరిష్కరించాలంటే ఎలా అని, ఆయనకు కాస్త సమయం ఇవ్వాలని ఈ హీరో మరోసారి స్పష్టం చేశారు. ఇక ఈ హీరో ఒరిస్సా దేవాలయాల నేపథ్యంలో చేస్తున్న ‘వసుదేవ సుతం’ అనే మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ వచ్చే నెల జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.

