ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ వర్గాలలో ఆనందాన్ని నింపాయి. దానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫలితాల అనంతరం పోస్ట్ చేసిన ట్విట్ ఉదాహరణ. ‘జాతీయ వాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు’ అని చెబుతూనే, ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడంతో ఆ పార్టీకి ప్రకాశ్ రాజ్ పై ఎంత కోపం ఉందో అర్థమౌతోంది. ఇక బీజేపీకి చెందిన వ్యక్తులు కొందరు మంచు విష్ణు పొందిన విజయాన్ని కంటే… ప్రకాశ్ రాజ్ కు లభించిన ఓటమిని ఎంజాయ్ చేశారని వారి ట్వీట్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమౌతోంది. ‘ప్రధానమంత్రితో పోరాడుతా అన్నవాడు మళ్ళీ ఓడాడు’ అని కొందరు, ‘మోదీ పీఎం కాకుండా చేస్తానన్న ప్రకాశ్ రాజ్, కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, చివరకు 900 మంది ఉన్న ‘మా’ ఎన్నికల్లోనూ ఓడిపోయాడు’ అంటూ ఎద్దేవా చేశారు. చిత్రం ఏమంటే… ‘మా’ సభ్యులను ప్రభావితం చేసేంత శక్తి వీరికి లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం జాతీయ వాద వ్యతిరేక శక్తి అయిన ప్రకాశ్ రాజ్ ను ఓడించాలనే ప్రచారం గత నెల రోజులుగా చేస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో తెలంగాణ కార్డును ఉపయోగించి రంగంలోకి దిగిన బీజేపీ తెలంగాణ సినిమా సెల్ ఇన్ ఛార్జ్ ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పోటీ నుండి తప్పుకోవడం వెనుక కూడా బీజేపీ నేతల ఒత్తిడి ఉండి ఉండవచ్చునని పిస్తోంది. ఎన్నికలకు రెండు రోజుల ముందే ఆయన ‘మా’ సభ్యత్వంతో పాటు బీజేపీకీ రాజీనామా చేయడం కొసమెరుపు. ఒకవేళ పోటీ నువ్వా నేనా అన్నట్టు అధ్యక్ష పదవికి పోటీ జరిగి ఉంటే… ఆయనకు వచ్చే పది, పాతిక ఓట్లు కూడా ప్రాధాన్యత సంతరించుకునేవి.
Read Also : “మా”కు మెగా బ్రదర్ రాజీనామా
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, మొదటి నుండీ బీజేపీ కొమ్ముకాస్తూ వచ్చిన నాగబాబు… ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ వర్గాన ఉండి శల్య సారధ్యం చేశారా అనే అనుమానం ఇప్పుడు కొందరు వ్యక్తం చేస్తున్నారు. దగ్గరుండి ప్రకాశ్ రాజ్ ను ఆయన ఓడించారా అనే సందేశాన్ని వెలిబుచ్చుతున్నారు. ప్రకాశ్ రాజ్ పేరు తెర మీదకు రాగానే నాన్ లోకల్ అనేది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే దానిని విష్ణు వర్గం కంటే… ప్రకాశ్ రాజ్ వెనక ఉన్నవారే ఎక్కువగా ఉపయోగించారేయో అనిపిస్తోంది. ప్రతి సమావేశంలోనూ, ప్రతి డిబేట్ లోనూ దానిని ఓ ఇష్యూగా చేసి, నాన్ లోకల్ ప్రకాశ్ రాజ్ తప్పితే ‘మా’ను ఆదుకునేవాడు లేడనే నెగెటివ్ భావనను వీరంతా సజీవంగా ఉంచారేమోననిపిస్తోంది. ఇక ఎలక్షన్లు రెండు మూడు రోజుల్లో ఉన్నాయని అనగా నాగబాబు సీనియర్ ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావును, బాబూమోహన్ ను ఇంటర్వ్యూలలో తూలనాడటం ఆయన గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, ప్రకాశ్ రాజ్ పై ‘మా’లోని సభ్యుల ప్రతికూలతపై ఆజ్యం పోసినట్టు అయ్యింది. దాంతో మరింతగా హర్ట్ అయిన ‘మా’ సభ్యులు కొందరు ప్రకాశ్ రాజ్ వర్గీయులను పనిగట్టుకుని ఓడించారనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… నిజానికి చాలామంది మోహన్ బాబు పథక రచన కారణంగా మంచు విష్ణు గెలుస్తాడు తప్పితే, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని సభ్యులంతా విజయం సాధిస్తారని అనుకున్నారు. కానీ విష్ణు ప్యానెల్ సభ్యులు సైతం అధికంగా గెలవడంతో నాగబాబు లాంటి వారి శల్య సారధ్యం ఉపయోగపడిందేమోననే అనుమానం వ్యక్తం అవుతోంది. ‘మా’ ఫలితాలు రాగానే నాగబాబు రాజీనామా చేయడం చిత్రంగా ఉందని కూడా కొందరంటున్నారు. రేపు ఎన్నికలు అనగా నటుడు ఓ. కళ్యాణ్ విడుదల చేసిన ఓ వీడియోలోనూ ఇదే తరహా కామెంట్స్ ఉన్నాయి. ‘ప్రతిసారీ నాగబాబు మంత్రసానితనం ఒప్పుకుని, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు’ అని. అయితే ఈసారి ‘మధ్యలో వదిలిపోకుండా చివరి వరకూ ప్రకాశ్ రాజ్ వెనక ఉండి, ఓడించారనిపిస్తోంది’ అని కొందరు చెబుతుండటం విశేషం. ‘మోదీ సానుభూతి పరుడైనా నాగబాబు ట్రాప్ లో పడి ప్రకాశ్ రాజ్ పరాజయం పొందారు’ అని కొందరు అభివర్ణిస్తుండటం విశేషం.