Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను

Mittapalli

Mittapalli

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో, చేతికొచ్చిన అవకాశాలను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ, తనకంటూ కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయని నిరూపించారు ప్రముఖ లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్. తెలంగాణ ఉద్యమ గీతాలతో పాపులర్ అయి, ‘జార్జ్ రెడ్డి’ చిత్రంలోని ‘బుల్లెట్ సాంగ్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’లో ‘రాంబాయి’ పాటలతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసిన ఆయన.. తాజాగా ఐటెం సాంగ్స్, బూతు పాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న ‘మారెమ్మ’కి సురేందర్ సాంగ్స్ రాశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కమర్షియల్ సినిమాలకు రాయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఐటెం సాంగ్స్, డబుల్ మీనింగ్ పాటలకు మాత్రం తాను పూర్తిగా దూరమని మిట్టపల్లి సురేందర్ స్పష్టం చేశారు. “నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ దర్శకుడై, తన కమర్షియల్ సినిమా కోసం ఐటెం సాంగ్ రాయమన్నాడు. స్నేహం కోసం పాట రాశాను కానీ, అతనికి ఇవ్వలేదు. నేను రాసే పాట ఏదైనా సరే.. నా తల్లి, నా కూతురు, నా సోదరి అందరూ కలిసి వినేలా ఉండాలి. వాళ్ళు వింటున్నప్పుడు అసహ్యంతో స్కిప్ చేసేలా ఉండకూడదు. ఈ ఐటెం సాంగ్స్ రాయననే మొండితనం వల్ల ఒక సినిమాకు సింగిల్ కార్డ్ (సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం) క్రెడిట్ కూడా కోల్పోయాను. అయినా సరే నా నిర్ణయం మార్చుకోను” అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.