అనూహ్యంగా ఎన్టీఆర్, కొరటాల సినిమా తెరమీదకు వచ్చింది. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే బన్నీ అభిమానులలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అల్లు అర్జున్-కొరటాల శివ కలయికలో సినిమా అంటూ ఆ మధ్య ఓ న్యూస్ అధికారికంగానే వచ్చింది. ‘ఏఏ21’ గా గీతా ఆర్ట్స్ 2 సహకారంతో యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తారని ఆ ప్రకటన సారాంశం. పాన్ ఇండియా చిత్రంగా తీస్తామనీ చెప్పారు. నాలుగు భాషలలో రాబోయే ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కొరటాల, ఎన్టీఆర్ సినిమా ప్రకటనతో షాక్ కి గురయ్యారు. సుకుమార్ తో బన్నీ ‘పుష్ప’ చేస్తున్నాడు. ఆగస్టు 13న ఇది విడుదల కానుంది. ఆ తర్వాత కొరటాల సినిమానే పట్టాలెక్కుతుందని భావించిన అల్లు అర్జున్ అభిమానులకు మధ్యలో ఎన్టీఆర్ సినిమా ప్రకటన రావటం మింగుడుపడలేదు. ఇదే విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలెట్టారు. కొందరు అభిమానులు ట్విట్టర్ లో నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ను ట్యాగ్ చేసి ప్రశ్నించటం మొదలెట్టారు కూడా. దాంతో నిర్మాత సుధాకర్ తప్పక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. బన్నీ, కొరటాల శివతో తను తీయబోయే సినిమా ఏప్రియల్ 2022 నుంచి మొదలవుతుందని… గీతా ఆర్ట్స్ వారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామి చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్నారు. టెంపుల్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరో వైపు బననీ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. అటు ఆచార్యతో పాటు పుష్స టీజర్స్ ఫ్యాన్స్ ను బాగా అకట్టుకుంటున్నాయి. ఇక ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేసి కొరటాల సినిమాలో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తాయి. ఈ సినిమా ప్రకటనతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించటం విశేషం. 2022 ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఆ వెంటనే కొరటాల, బన్నీ సినిమా షూటింగ్ జరుగుతుందన్నమాట.