బాలీవుడ్ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ లండన్‌లో పోలో ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 10,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంను నిర్మించిన ఆయన, తన వ్యక్తిగత జీవితం, మూడు వివాహాల కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచేవాడు. రెండో భార్య కరిష్మా కపూర్ తో ఇద్దరు పిల్లలు, మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో మరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన మృతితో, ఇప్పుడు కుటుంబంలో భారీ ఆస్తి వివాదం తలెత్తింది.
Also Read : Aamir Khan : ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్
సంజయ్ మృతి అనంతరం ప్రియా సచ్ దేవ్ ఆస్తులన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోవాలని కుట్ర పన్నిందని, తాము న్యాయబద్ధంగా వారసత్వంలో భాగస్వాములు కావాలని కరిష్మా పిల్లలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ తండ్రి ఆస్తిలో ఐదో వంతు వాటా తమకే రావాల్సి ఉందని కోర్టులో పిటిషన్ వేశారు. దావాలో ముఖ్యంగా ప్రియా ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తారు. సంజయ్ మరణం తరువాత ఆస్తుల బదిలీలు, ఖాతాల మార్పులు, ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలను ప్రియా గోప్యంగా ఉంచిందని ఆరోపించారు. అంతేకాదు, చివరి వీలునామా ఉందని చాలా ప్రశ్నించిన తర్వాత మాత్రమే బయటపెట్టారని, అంతకుముందు ఎలాంటి విల్ లేదని పదేపదే చెప్పిందని పేర్కొన్నారు.
సంజయ్ కపూర్ ఆస్తులు ఎక్కువగా ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్‌లో ఉన్నాయని సమాచారం. కానీ ట్రస్ట్ డీడ్, ఆస్తుల పూర్తి వివరాలను పిల్లలతోనూ, కరిష్మాతోనూ ఎప్పుడూ పంచుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా, 25 జూలై 2025 న జరగనున్న ట్రస్ట్ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం లేదని.. అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం పై కూడా వారు అభ్యంతరం తెలిపారు. ఇక చివరి విల్ చట్టబద్ధతపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దానిని తారుమారు చేసి చాలా కాలం దాచిపెట్టారని కూడా ఆరోపించారు. ప్రస్తుతం కరిష్మా పిల్లలు తమ తండ్రి ఆస్తిలో తమకున్న న్యాయమైన వాటా కోసం కోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో హైకోర్టు, వీలునామా నిజస్వరూపం, ట్రస్ట్ ఆస్తుల స్థితి, ప్రియా చర్యలు పిల్లల హక్కులకు హానికరమా కాదా అనే అంశాలను పరిశీలించనుంది. ఈ కేసు తీర్పు, బాలీవుడ్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ పెద్ద చర్చనీయాంశం కానుంది.