కన్నడ నటి షనయ కట్వే ను ఆమె సోదరుడి హత్యకేసులో మంగళవారం హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కన్నడ చిత్రం ‘ఇదమ్ ప్రేమమ్ జీవితమ్’ తో మోడల్ షనయ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆమె తాజా చిత్రం ‘ఒరు ఘట కథ’ ప్రమోషన్ లో భాగంగా కొంతకాలంగా హుబ్లీలో ఉంటోంది. నటి షనయ సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని పలు ప్రాంతాలలో పడేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని ఆరా తీయగా, నియాజ్ అహ్మద్, అతని స్నేహితుల పని ఇదని తెలిసింది. షనయ కొంతకాలంగా నియాజ్ తో ప్రేమాయాణంగా సాగిస్తోందని, దానిని ఆమె సోదరుడు రాకేశ్ వ్యతిరేకించడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. తాజాగా రాకేశ్ తల దేవరగుడిహల్ అటవీ ప్రాంతంలో లభ్యమైంది. ఇప్పటికే అనుమానితులైన నియాజ్ అహ్మద్ (21), తౌసిఫ్ (21), అల్తాఫ్ ముల్లా (24), అమర్ (19)లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా డొంక కదిలింది. రాకేశ్ హత్యలో అతని సోదరి, నటి షనయ హస్తం కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు.