రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ మొదలైంది. సాధారణంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేస్తారు. అయితే, ‘జననాయకన్’ మూలాలు తెలుగులోనే ఉన్నాయి. మన నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందిన భగవంత్ కేసరి కథను తమిళంలో భారీ హంగులతో పునర్నిర్మించారు.
Also Read: Sharwa: డిజాస్టర్ డైరెక్టర్’తో శర్వా నెక్స్ట్?
ఇప్పుడు అదే సినిమాను తిరిగి తెలుగులోకి డబ్ చేసి జనవరి 9న విడుదల చేస్తున్నారు. అంటే, మన ఇంట్లో పుట్టిన బిడ్డకు పరాయి వాళ్ళ బట్టలు వేసి మళ్ళీ మనకే పరిచయం చేస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఈ కాలంలో ఓటీటీ పుణ్యమా అని ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలపై ఒక రకంగా అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో, ఆల్రెడీ చూసేసిన కథను మళ్ళీ డబ్బింగ్ రూపంలో చూడటానికి మన ఆడియన్స్ ఎంతవరకు మొగ్గు చూపుతారనేది ఒక పెద్ద ప్రశ్న.
Also Read:Pooja Hegde : మళ్ళీ ఫామ్‌లోకి పూజా హెగ్డే.. లక్కు తగిలితే మాత్రం..!
అయితే ఈ ప్రాజెక్టు విషయంలో మరో కీలక పరిణామం ఏమిటంటే, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా తెలుగు పంపిణీ బాధ్యతల నుంచి తప్పుకోవడం. తెలుగు రాష్ట్రాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ కలిగిన సితార లాంటి సంస్థ తప్పుకోవడానికి కారణం ఏమిటనే చర్చ ఫిలిం నగర్లో సాగుతోంది. బహుశా, ఒరిజినల్ తెలుగు వెర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు, ఈ డబ్బింగ్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందనే సందేహాలే ఇందుకు కారణం కావొచ్చు. జనవరి 9న తమిళ వెర్షన్‌తో పాటే ఈ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి సీజన్ కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుంది, మరి ఇలాంటి ప్రయోగం ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేదో వేచి చూడాలి. అయితే సినిమా అంటేనే ఒక గ్లామర్ బిజినెస్. ఇక్కడ లాజిక్ కంటే మ్యాజిక్ కే ప్రాధాన్యత ఎక్కువ. ఒకవేళ మేకింగ్‌లో భారీ మార్పులు చేసి, సరికొత్త అనుభూతిని ఇస్తే తప్ప, ఈ ‘రివర్స్ రీమేక్’ ఫార్ములా సక్సెస్ అవ్వడం కష్టమే. చూడాలి ఏం జరగనుంది అనేది.