Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!

Irumudi

Irumudi

Irumudi: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి టైటిల్‌తో పాటు కథలోని ప్రత్యేకతలపై తాజాగా చిత్ర బృందంతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథ ప్రాథమికంగా మూడు లేయర్లలో సాగుతుందని తెలిపారు. టైటిల్‌కు కూడా కథలోని ఈ మూడు లేయర్స్‌కి సంబంధం ఉందని చెప్పారు. అయ్యప్ప స్వామికి, ఆయనను కొలిచే భక్తుడికి మధ్య ఉండే అనుబంధం ఒక లేయర్ కాగా.. తండ్రి, కుమార్తె మధ్య ఉన్న బంధం మరో ముఖ్యమైన అంశమని వివరించారమన్నారు. ఇక మూడో లేయర్‌గా సినిమాలోని సస్పెన్స్, చిన్న క్రైమ్ యాంగిల్, ఊహించని ప్రపంచం ఉంటుందని శివ నిర్వాణ వెల్లడించారు. సాధారణంగా ఒక చిక్కుముడిని ‘ముడి’ అని అంటామని, కథలోని అన్ని అంశాలను కలిపే ఆ ముడి ఆధారంగానే ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలిపారు.

‘‘ఎమోషన్‌తో పాటు ఫియర్, టెన్షన్‌ను మిళితం చేసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించాలనుకున్నాం. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు. రవితేజ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే కొన్ని సన్నివేశాలను రూపొందించినట్లు కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా ‘ఇరుముడి’ పాటలో రవితేజను చూసినప్పుడు సామాన్య ప్రేక్షకులకు తమ కుటుంబంలోని వ్యక్తిని చూసిన భావన కలగాలని అనుకున్నామని చెప్పారు. రవితేజ కెరీర్‌లో ‘సింధూరం’ నుంచి ఇప్పటివరకు ఆయనతో కనెక్ట్ కాని కుటుంబాలు, మహిళలు, పిల్లలు చాలా తక్కువేనని పేర్కొన్నారు. గ్రామాల్లో సాధారణంగా రిక్షా కార్మికుడు, ఆటో డ్రైవర్, మధ్యతరగతి వ్యక్తి.. ఇలా అన్ని వర్గాల వారు అయ్యప్ప మాల ధరించి భక్తితో కనిపిస్తారని, అదే సహజత్వం రవితేజ పాత్రలోనూ కనిపించాలని భావించినట్లు తెలిపారు. ‘ఇరుముడి’లో రవితేజను చూసినప్పుడు ప్రేక్షకులకు ‘‘మా నాన్న, మా బాబాయి, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు’’ అనే అనుభూతి కలగాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలతో పాటు ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్‌తో ‘ఇరుముడి’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. అలాగే నిర్మాత మైత్రీ రవి మాట్లాడుతూ.. ఈ కథను మొదట విన్నప్పుడే ఇందులోని అయ్యప్ప బ్యాక్‌డ్రాప్, కథలోని విభిన్న షేడ్స్ తమకు బాగా నచ్చాయని చెప్పారు. ఈ కథకు రవితేజ మాత్రమే సరైన హీరో అని తాము బలంగా నమ్మినట్లు వెల్లడించారు. ‘‘ఎమోషనల్ యాంగిల్, ఇంటెన్స్ ఫైట్, యాక్షన్, కొంత ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్నీ కలిసిన కథ ఇది. ఇందులోని న్యాచురల్ ఎమోషన్స్‌కు రవితేజ అయితేనే న్యాయం చేయగలరని దర్శకుడితో పాటు మేమంతా బలంగా నమ్మాం. కథ చెప్పగానే రవన్నకు కూడా నచ్చింది’’ అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.