సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా వాడారని ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు మేరకు, పాటలు తొలగించే వరకు సినిమాను స్ట్రీమింగ్ చేయకుండా నిలిపివేయాలని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. అందుకే ఈ సినిమాను ఓటీటీ నుంచి తాత్కాలికంగా తొలగించారు. పాటలను తీసేసి తిరిగి స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియదు.
Also Read:Suman Shetty : ఆ డైరెక్టర్ కు రోజూ పూజ చేస్తున్న సుమన్ శెట్టి..
ఇళయరాజా పాటలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో గతంలో చాలాసార్లు రుజువైంది. ఆ పాటలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయనకు మాత్రమే ఉంటాయని, వాటిని ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా రాయల్టీ చెల్లించాలని ఆయన చాలా కఠినంగా ఉంటారు. ఈ విషయంలో ఆయన చాలా చట్టబద్ధంగా వ్యవహరిస్తారు. ఇటీవల విజయం సాధించిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’లో ఇళయరాజా స్వరపరిచిన ‘గుణ’ సినిమాలోని ‘కణ్మని అన్బోడు’ పాటను ఉపయోగించుకున్నారు. సినిమా ఓపెనింగ్ టైటిల్స్‌లో ఇళయరాజాకు కృతజ్ఞతలు తెలిపినప్పటికీ, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు. రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ‘కూలీ’ సినిమా టీజర్లో కూడా ఇళయరాజా ‘తంగ మగన్’ సినిమాలోని ట్యూన్‌ను అనిరుధ్ ఉపయోగించడంతో, సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థకు నోటీసులు పంపారు.
ఈ సంఘటనలన్నీ ఇళయరాజా తన సంగీతం విషయంలో ఎంత కఠినంగా ఉంటారో, కాపీరైట్ చట్టాల పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో తెలియజేస్తున్నాయి. ఆయన సంగీతం ఒక విలువైన సంపద అని, దాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.