(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు)
‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’ చిత్రం తెరకెక్కించారు. కన్నడనాట ‘అప్పు’ అఖండ విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన నాలుగు నెలలలోపే ‘ఇడియట్’ తెలుగునాట విడుదలై విజయఢంకా మోగించడం విశేషం! 2002 ఆగస్టు 22న ‘ఇడియట్’ విడుదలయిన ‘ఇడియట్’కు “ఓ చంటిగాడి ప్రేమకథ” అనే ట్యాగ్ ఉంది.
‘ఇడియట్’ కథ ఏమిటంటే – కానిస్టేబుల్ వెంకటస్వామి కొడుకు చంటిగాడు డిగ్రీ చదువుతూ ఏదీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. తన కాలేజ్ లోనే చదివే సుచిత్రను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె మంచి మనసు తెలుసుకొని మరింతగా పొంగిపోతాడు. సుచిత్ర పోలీస్ కమీషనర్ విప్రనారాయణ కూతురు అని తెలుస్తుంది. అయినా చంటిగాడు లోకల్ అంటూ భయపడకుండా సుచిని ప్రేమిస్తాడు. మొదట్లో కాదనుకున్నా, తరువాత చంటి మనసు తెలిసి సుచిత్ర కూడా ప్రేమిస్తుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలిసిన పోలీస్ కమీషనర్ చంటికి వార్నింగిస్తాడు. తరువాత సెల్ లో వేసి తంతాడు. ఆ పై చంపే ప్రయత్నమూ చేస్తాడు. అయినా చలించని చంటిని చూసి తండ్రి వెంకటస్వామి భయపడిపోతాడు. తమ ఇంటికి వచ్చిన సుచిని వెంకటస్వామి, కమీషనర్ వచ్చి తీసుకుపోతే వెళ్లనివ్వమని చెబుతాడు. చంటి, తెలివిగా సుచిని ఇంట్లోంచి తీసుకు వచ్చి, డీజీపీ ఆఫీసు ముందరే తన మిత్రుల సహకారంతో పెళ్ళి చేసుకుంటాడు. మేజర్స్ అయిన వారి ప్రేమను డీజీపీ కూడా ఆశీర్వదిస్తాడు. వారి ప్రేమను అడ్డుకున్న కమీషనర్ నారాయణను సస్పెండ్ చేస్తాడు. చివరలో చంటి సివిల్స్ పాసై ఐపీయస్ కు సెలెక్ట్ అవుతాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
హీరోయిన్ రక్షిత ‘ఇడియట్’ ద్వారానే తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, సంగీత, గిరిబాబు, జీవా, ఆలీ, పృథ్వీరాజ్, విద్యావతి, శ్రీరామ్ శంకర్, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెస్ నారాయణ, నర్సింగ్ యాదవ్ నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే , నిర్మాత, దర్శకత్వం పూరి జగన్నాథ్ నిర్వహించారు. చక్రి స్వరకల్పన చేయగా, కందికొండ, భాస్కరభట్ల, పెద్దాడ మూర్తి పాటలు రాశారు. ఇందులోని “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…”, “జై వీరాంజనేయా…”, “సై రా సై…”,”చెలియా చెలియా…”,”లే లేత నవ్వులా…”,” ఈ రోజే…” అంటూ సాగే పాటలు అలరించాయి. సిహెచ్ పద్మావతి సమర్పణలో వైష్ణో అకాడమీ పతాకంపై రూపొందిన ‘ఇడియట్’ చిత్రానికి యమ్.ఎల్. కుమార్ చౌదరి నిర్వహణ వహించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.
Gokulamlo Seeta: పాతికేళ్ళ ‘గోకులంలో సీత’