నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. స్మార్ట్‌ఫోన్‌లో వందల కొద్దీ కాంటాక్ట్‌లు ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్క మనిషి కూడా కరువవుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎత్తిచూపుతూ, విభిన్న వయసులు, మనస్తత్వాలు ఉన్న ఏడుగురు మహిళల అందమైన ప్రయాణంగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒక టూరిస్ట్ గైడ్ సాయంతో ఏడుగురు మహిళలు అందమైన యూరప్ ట్రిప్‌కు వెళ్లడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో వయసు, ఒక్కో సమస్య, ఒక్కో నేపథ్యం. కలిసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో బయలుదేరిన వాళ్ల మధ్య త్వరలోనే భేదాభిప్రాయాలు వచ్చి గొడవలు మొదలవుతాయి. కానీ, ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ వాళ్లు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? పూర్తిగా భిన్నమైన వ్యక్తులు ఒకే జర్నీని పంచుకున్నప్పుడు వాళ్ల మధ్య ఏర్పడిన అనుకోని అందమైన బంధం ఏమిటి? అన్నది సినిమా కథాంశంగా ట్రైలర్ స్పష్టం చేసింది. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా తమ పాత్రలకు వందశాతం ప్రాణం పోశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిరామ్ నాయుడు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “జనాభా పెరిగే కొద్దీ మనుషుల మధ్య బంధాలు, తోడు పెరగాలి. కానీ మనం ఒంటరి వాళ్లం అవుతున్నాం. మన ఫోన్‌లో ఎన్నో నెంబర్లు ఉంటాయి, కానీ బాధ వస్తే ఎవరికీ ఫోన్ చేయలేని పరిస్థితి. మనుషులు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ జర్నీ ఎంత అందంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకులే హీరోలు. ఎందుకంటే ఇది మన అందరి కథ” అని దర్శకుడు పేర్కొన్నారు. నటీమణులు పాయల్ రాధాకృష్ణ, రూప, జినీషా, సునైనా మాట్లాడుతూ.. ఇది కేవలం అమ్మాయిల సినిమా మాత్రమే కాదని, అబ్బాయిలు, కుటుంబ సమేతంగా కలిసి చూడాల్సిన బ్యూటిఫుల్ జర్నీ అని తెలిపారు. ఈ సినిమాకు మణికందన్ సుబ్రమణియన్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూరప్ ల్యాండ్‌స్కేప్స్‌ను ఆయన కెమెరా కంటితో అద్భుతంగా బంధించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతమైన ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎడిటర్‌గా ఛోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి పనిచేశారు. సరికొత్త ఫన్, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌కు ఒక రిఫ్రెషింగ్ జర్నీని అందించబోతున్న ‘హ్యాపీ జర్నీ’ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది.

