(డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు)
కాలం కలసి వస్తే – జాలం భలేగా ఉంటుందని అంటారు. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఇంట జూనియర్ రామానాయుడుగా జన్మించిన రానా అలాంటి లక్కీ మేన్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి నట కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు రానా. తాత రామానాయుడు కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించగా, బాబాయ్ వెంకటేశ్ స్టార్ హీరోగా అలరించారు. వారి బాటలోనే రానా కూడా నటనలో అడుగు పెట్టి అనతికాలంలోనే తనదైన బాణీ పలికించారు. నవతరం కథానాయకుల్లో రానా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సాగుతున్నారు.
తాత రామానాయుడు పేరునే పెట్టుకున్న రానా 1984 డిసెంబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి డి.సురేశ్ బాబు ప్రముఖ నిర్మాతగా తెలుగు చిత్రసీమలో సాగుతున్నారు. తాత రామానాయుడు, తండ్రి సురేశ్ బాబు బాటలోనే రానా కూడా కొన్ని చిత్రాలను నిర్మించారు. చదువుతూ ఉన్న రోజుల్లోనే రానా ‘విజువల్ ఎఫెక్ట్స్’పై మంచి అవగాహన పెంచుకున్నారు. కొంతకాలం ‘విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ’ కూడా నిర్వహించారు. తన 20 ఏటనే ‘బొమ్మలాట’ అనే బాలల చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాశ్ దర్శకత్వంలో నిర్మించారు రానా. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. 2010లో రానా ‘లీడర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా నటునిగా రానాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. రెండవ చిత్రంగా ‘దమ్ మారో దమ్’ అనే హిందీ చిత్రంలో నటించారు. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లో నటించారు. ఇటు తెలుగు, అటు హిందీ చిత్రాలతోనూ సాగారు రానా. అయితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’లో భల్లాల దేవుని పాత్రలో రానా అభినయం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘రుద్రమదేవి’లో చాళుక్య వీరభద్ర పాత్రలోనూ ఆకట్టుకున్నారు రానా.
రానా నటించిన ‘ఘాజీ’ తెలుగు, హిందీ భాషల్లో రూపొంది ఆకట్టుకుంది. రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనే రాజు-నేనే మంత్రి’లో విలక్షణమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన “కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాలలో చంద్రబాబు పాత్రలో కనిపించారు రానా. ‘అరణ్య’ చిత్రంలోనూ విలక్షణమైన పాత్రలో అలరించారు రానా. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’గానూ తమిళంలో ‘కాడన్’గానూ విడుదలయింది. రానా హీరోగా నటించిన ‘1945’ డిసెంబర్ 31న జనం ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ తో కలసి రానా నటించిన ‘భీమ్లా నాయక్’ జనవరి 12న విడుదల కానుంది. అలాగే రానా హీరోగా రూపొందిన ‘విరాట పర్వం’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
రానా హీరోగా అడుగు పెట్టిన కొన్నాళ్ళకే టీవీలో హోస్ట్ గా ‘నంబర్ వన్ యారీ’ కార్యక్రమం నిర్వహించి ఆకట్టుకున్నారు. విశాల్ హీరోగా రూపొందిన ‘యాక్షన్’ సినిమా తెలుగు వర్షన్ లో “లైట్స్ కెమెరా యాక్షన్…” అనే పాట పాడి ఆకట్టుకున్నారు రానా. “విన్నర్, సుబ్రహ్మణ్యపురం” చిత్రాలలో రానా వ్యాఖ్యాతగానూ వ్యవహరించారు.
మునుముందు రానా తనలోని మరెన్ని కోణాలను ఆవిష్కరించనున్నారో చూడాలి.