కరోనా వల్ల సినిమాల విడుదల వాయిదా పడిందన్న సంగతి విదితమే. దీంతో థియేటర్లు మూతపడగా… ఇప్పుడు చాలా సినిమాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. థియేటర్లు బంద్, కరోనా వంటి సమస్యల కారణంగా చాలా మంది స్టార్స్ తమ సినిమాల విడుదల గురించి పడిగాపులు పడుతున్నారు. కానీ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ఎంచక్కా తన సినిమాలను వరుసగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేసే పనిలో ఉన్నారు. “సి యూ సూన్”, “ఇరుల్”, “జోజి” వంటి చిత్రాలతో ఇప్పటికే ఓటిటి ద్వారా మంచి స్పందన అందుకున్న ఫహద్… మరోసారి తన నెక్స్ట్ మూవీని కూడా ఓటిటిలోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ముందుగా ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితులు చివరకు ఈ సినిమాను నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియోకు విక్రయించేలా చేసింది. తాజాగా “మాలిక్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Read Also : పవన్, రానా మూవీ షూటింగ్ రీస్టార్ట్… ఎప్పుడంటే?
యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రంలో ఫహద్ వేర్వేరు వయసులలో వేర్వేరు గెటప్‌లలో కన్పించారు. “మాలిక్” చిత్రానికి మహేష్ నారాయణన్ రచన, దర్శకత్వం అందించారు. ఇందులో నిమిషా సజయన్ హీరోయిన్ పాత్ర పోషించింది. వినయ్ ఫోర్ట్, జలజా, జోజు జార్జ్, దిలీష్ పోథన్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 15న ప్రైమ్ వీడియోలో “మాలిక్” ప్రీమియర్ కానుంది.