Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు

Prabhakar Daughter

Prabhakar Daughter

టాలీవుడ్‌లో నటవారసులు వెండితెరకు పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదో లేక సరికొత్త ప్రయోగాలు చేయాలనే ఆలోచనో తెలియదు కానీ, ప్రముఖ సీనియర్ నటుడు ‘ఈటీవీ’ ప్రభాకర్ కుమార్తె దివిజ ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ వైపు అడుగులేస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తెలుగులో ఆశించిన బ్రేక్ దక్కకముందే, ఈ తెలుగమ్మాయి నేరుగా తమిళ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దివిజ ‘వెంకట్రామయ్యగారి తాలూకా’ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయమైంది. అనంతరం ‘బ్రహ్మ ఆనందం’, ‘హే సిక్కిత’ వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా, ‘తోలు బొమ్మలు’ అనే ఓటీటీ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది.

కోలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్
ఇప్పుడు తన కెరీర్‌ను మరో మలుపు తిప్పుకుంటూ దివిజ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. గతంలో ‘రంగోలి’, ‘మద్రాస్కరన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వలీమోహన్ దాస్ రూపొందిస్తున్న కొత్త సినిమాలో దివిజ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో డీజే అరుణాచలం హీరోగా నటిస్తున్నారు. దివిజ నటిస్తున్న ఈ తమిళ చిత్రానికి సాంకేతిక నిపుణులు కూడా గట్టిగానే కుదిరారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇండియా ఫిల్మ్ కంపెనీ, శ్రీ సుమనోకర ప్రొడక్షన్, గ్రాటిట్యూడ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ వారసురాలు, తమిళ తంబీల మనసు గెలుచుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందో లేదో చూడాలి.