బేబి డమరి సమర్పణలో, శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర”. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘A’ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న కార్తీక మాసం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహించడంతో పాటు, ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. మదర్ సెంటిమెంట్, హార్రర్ మరియు యాక్షన్ అంశాల కలబోతగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, “ఈ చిత్రంలో హార్రర్ సన్నివేశాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెన్సార్ సభ్యులు ‘A’ సర్టిఫికెట్ జారీ చేశారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఈ సినిమా చూసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కథలో హార్రర్ అంశాలు ప్రేక్షకులను తీవ్రంగా భయపెడతాయి” అని తెలిపారు.