తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో జరిగిన ఒక ఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ‘కోర్టు’ సినిమాను పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏమిటంటే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో పరువు హత్య జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అజయ్ -నిఖిత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే, వేరే కులానికి చెందిన అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో నిఖిత గర్భం దాల్చడంతో, ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్పాడు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు.
Tamannaah : వాళ్ల మీద చేతబడి చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్
శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఎన్టీవీతో మాట్లాడిన అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది.