ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న లాక్‌డౌన్ చర్యల వల్ల కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్‌లో ఆక్సిజన్ అందక చాలా మంది తనువు చాలిస్తున్నారు. కాగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆక్సిజన్ బ్యాంకులు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్ ట్యాంకుల నిర్వహణ బాధ్యతలను అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నారు. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది.