సోషల్ మీడియా.. షార్ట్ ఫిలిమ్స్ కానుంచి వెండితెరపై హారోయిన్‌గా సత్తచాటిన ముద్దుగుమ్మ చాందినీ చౌదరి. “ది లాస్ట్ కిస్”, “ఫాల్ ఇన్ లవ్”, “లవ్ అట్ ఫస్ట్ సైట్” వంటి పాపులర్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి, ప్రతీసారి కొత్తదనాన్ని చూపించే నటి చాందినీ చౌదరి ఈసారి సైన్స్ ఫిక్షన్ టచ్‌తో కూడిన సూపర్ హీరో కథలో కనిపించబోతోంది. సుశాంత్ యాష్కీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వికాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన గోపాల్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, “వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధించాలి. కొత్త జానర్ ప్రయత్నించడం ఎప్పుడూ ఒక సాహసమే. దర్శకుడు వికాశ్, చాందినీ, సుశాంత్‌ల కలయిక ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని అన్నారు. నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ, “ఇది డార్క్ కామెడీతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపిన సినిమా. ఇందులో సూపర్ హీరోను ఎవరూ ఊహించని కోణంలో చూపించబోతున్నాం. ఇది సూపర్ హీరో సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం అవుతుంది. ఈనెలాఖరులో హైదారాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అని వెల్లడించారు. జీవన్ కుమార్, అజయ్ ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆసక్తికరమైన అంచనాలు నెలకొన్నాయి. చాందినీ చౌదరి ఇప్పటివరకు చేసిన పాత్రలకంటే విభిన్నమైన రోల్లో కనిపించబోతున్నారని టీమ్ చెబుతోంది. సైన్స్ ఫిక్షన్ మరియు హ్యూమర్ మేళవింపుతో ఈ చిత్రం యువ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.