CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..

Cbfc

Cbfc

CBFC: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన నూతన పాలకమండలిని కేంద్రం అధికారికంగా నియమించింది. ఈ కమిటీ రాబోయే మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.

పాలకమండలిలో తెలుగు నుంచి సుప్రియకు కీలక బాధ్యత

ఈ నూతన కమిటీలో సినిమా, సంగీత రంగాలకు చెందిన అగ్రశ్రేణి దిగ్గజాలకు కేంద్రం పెద్దపీట వేసింది. బాలీవుడ్ స్టార్స్ ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టితో పాటు బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీ, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ నూతన సభ్యులుగా ఎంపికయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కొత్త పాలకమండలిలో స్థానం దక్కింది. గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్, ప్రముఖ నటి రూపాలీ గంగూలీ, సీనియర్ నటుడు మనోజ్ జోషి, సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, అభిషేక్ జైన్, వినోద్ అనుపమ్, యతీంద్ర మిశ్రాలకు కూడా ఈ బోర్డులో స్థానం కల్పించారు.

పాత కమిటీకి ఉద్వాసన..
గత కమిటీలోని సభ్యుల్లో అత్యధికులను తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అలనాటి తార గౌతమి, జీవితా రాజశేఖర్, ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి విద్యా బాలన్, మాజీ ఫుట్‌బాల్ స్టార్ భైచుంగ్ భూటియాల పదవీకాలం ముగియడంతో వారికి ఉద్వాసన పలికారు. కేవలం రంగస్థల దర్శకుడు వామన్ కేంద్రే, ప్రముఖ రచయిత రమేశ్ పతంగేలకు మాత్రమే తిరిగి ఈ కమిటీలో కొనసాగే అవకాశం లభించింది. కంటెంట్ సర్టిఫికేషన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సినిమాటిక్ సెన్సార్‌షిప్ వివాదాలు నిత్యం రగులుతున్న ప్రస్తుత తరుణంలో, వివిధ భాషలకు చెందిన స్టార్స్, మేకర్స్, మ్యూజిక్ లెజెండ్స్‌తో సరికొత్తగా కొలువుదీరిన ఈ నూతన CBFC బోర్డు భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.