సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్. చాలామంది తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా త్వరలో తెరంగ్రేటం చేయడానికి సిద్ధమైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఖుషి కపూర్ ఈ మధ్యనే నటనకు సంబంధించిన తన చదువు పూర్తి చేయడం. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నటనకు సంబంధించిన కోర్సులు చేసిన ఆమె ఈ మధ్యనే ముంబై తిరిగి వచ్చిందట. ఇంకేముంది ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే కరణ్ జోహార్ తన రాబోయే సినిమాలో అవకాశం ఇస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరో పక్క ఖుషి కోసం ఆమె తండ్రి బోనీకపూర్ కూడా రంగంలోకి దిగాడు అని అంటున్నారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లేదా తమిళ మలయాళ భాషల్లో అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారట. అందుకే ఇక్కడి దర్శక నిర్మాతలతో టచ్ లోకి వెళ్లాడని అంటున్నారు. నిజానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ అనే సినిమాని శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ప్రకటించగానే ఆ సినిమాలో హీరోయిన్ పాత్రలో ఖుషి కనిపించనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ మధ్యనే ఆమె చదువు పూర్తి చేసుకుని రావడంతో మళ్లీ ఆమె వెండితెర అరంగ్రేటంపై ప్రచారం మొదలైంది.