అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో ఈ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ స్పియర్స్ కు తీవ్రమైన శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడటం వల్ల ఆమెకు సంబంధించిన అన్ని అంశాలపై ఆమె తండ్రికి ‘కన్జర్వేటర్‌షిప్’ అంటూ న్యాయస్థానం హక్కులు కల్పించింది. తాజాగా తండ్రి నియంత్రణ నుంచీ తనకు విముక్తి కల్పించమని కోర్టును కోరిన బ్రిట్నీ స్పియర్స్ తాను బానిసగా బతకాల్సి వస్తోందని వాపోయింది. తనకు గర్భం రాకుండా శరీరంలో ‘ఐయూడీ’ అనే పరికరం అమర్చారని, అది తనకు ఇష్టం లేకున్నా భరించాల్సి వస్తోందని ఆమె చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని, బిడ్డని కనాలని ఉందంటూ లాస్ ఏంజిలెస్ కోర్టులో న్యాయమూర్తికి మొరపెట్టుకుంది. తనకు ఇష్టం లేకపోయినా లైవ్ షోలు చేయాలని బలవంతం చేస్తున్నట్టు పేర్కొంది. 39 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్ ఆమె తన తండ్రి జామీ స్పియర్స్ పరిరక్షణలో 13 సంవత్సరాలుగా ఉంది. అయితే తాజాగా ఆమె తండ్రి బ్రిట్నీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయించాల్సిందిగా కోర్టును అభ్యర్థించినట్టు తెలుస్తోంది.
Read Also : ఆకట్టుకుంటున్న హారర్ థ్రిల్లర్ “డోంట్ బ్రీత్-2” ట్రైలర్
ఈ మేరకు కొన్ని డాక్యుమెంట్స్ ను కోర్టుకు సమర్పించిన జామీ స్పియర్స్ తన కుమార్తె సంరక్షకుడిగా, ఆమె క్షేమం కోసం ఏమేం చేయాలో అన్నీ చేశానని, ఆమె వ్యక్తిగత నిర్ణయాలపై అధికారం కలిగి ఉన్న తాను 2012లోనే ఆమె వివాహం చేసుకోవటానికి, కాబోయే భర్తతో కన్జర్వేటర్‌షిప్ బాధ్యతలను పంచుకోవడానికి అంగీకరించానని చెప్పాడు. ఆమె మాజీ మేనేజర్ అయిన జాసన్ ట్రావిక్‌తో పాప్ సింగర్ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ జంట 2013 లో విడిపోయారు. బ్రిట్నీ ఆరోపణలు నిజమైతే తదుపరి చర్యలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. అసలు తండ్రిపై బ్రిట్నీ ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేసిందో మరి…! ప్రస్తుతం బ్రిట్నీ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.