ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి హీరో శ్రీనివాసే కాదు, దర్శకుడు వీవీ వినాయక్ కూడా తొలిసారి అడుగు పెడుతున్నారు. ఉత్తరాది మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్ ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అంటే తనకెంతో అభిమానమని, అతను నటించిన ‘కహో నా ప్యార్ హై’, ‘ధూమ్ 2’ చిత్రాలంటే ఇష్టమని చెప్పాడు.
Read Also : ‘లక్కీ స్టార్’గా కన్నడ రాక్ స్టార్ యశ్
కరోనా సందర్భంగా ఇంటికే పరిమితం అయిపోవడం కాస్తంత బాధ కలిగించినా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని సాయి శ్రీనివాస్ చెప్పాడు. బాడీ మజిల్స్ పెంచడానికి అత్యధిక సమయం కేటాయించానని అన్నాడు. ఏదో రకంగా ప్రేక్షకులను భ్రమకు గురి చేయడం ఇవాళ్టి పరిస్థితులలో జరగదని స్పష్టం చేశాడు. అలానే తొలిసారి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సందర్భంగా హిందీ భాషపై పట్టు సంపాదించడానికి కృషి చేశానని, తద్వారా ఉత్తరాది ప్రేక్షకులు తనను తమ వాడిగా భావించే ఆస్కారం ఉందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇవాళ్టి కాలానికి తగ్గట్టుగా ‘ఛత్రపతి’ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులూ చేశామని, మాతృకను మించి ఈ సినిమా ఉండబోతోందని శ్రీనివాస్ తెలిపాడు.