Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!

Balakrishna Dada

Balakrishna Dada

Dada Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గతంలో ‘అఖండ 2’ రిలీజ్ విషయంలో ఎలాంటి గందరగోళం, వాయిదాల పర్వం సాగిందో.. ఇప్పుడు ‘దాదా’ విషయంలోనూ దాదాపు అదే సీన్ రిపీట్ కానుందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. చెప్పిన డేట్‌కే వస్తుందా లేక రేస్ నుంచి తప్పుకుంటుందా అనే సందిగ్ధత నందమూరి అభిమానులను తీవ్ర టెన్షన్‌కు గురిచేస్తోంది.

‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటినుంచీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను దసరా బరిలోనే దించాలని భావించినా, షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 24కి మార్చారు. తీరా కాకినాడ పోర్టులో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా బాలకృష్ణకు కాలుజారి గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దాదాపు రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో అసలు క్రిస్మస్‌కు రావడం అసాధ్యమనే ప్రచారం ఊపందుకుంది. అయితే డేట్ మిస్ కాకూడదన్న పట్టుదలతో బాలయ్య గాయం నుంచి కోలుకున్న వెంటనే నాన్‌స్టాప్‌గా రంగంలోకి దిగారు. మైసూర్ షెడ్యూల్ ముగించుకుని, రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. కానీ కాకినాడలో మిగిలిపోయిన ఫైట్ సీక్వెన్స్‌ను రీ-షూట్ చేద్దామనుకునే సమయానికి తీరం దాటిన తుఫాను, ఎడతెరిపిలేని భారీ వర్షాలు యూనిట్ ప్లాన్‌ను పూర్తిగా దెబ్బతీశాయి.

ప్రస్తుతం రిలీజ్‌కు కేవలం 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ఒక పాటతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులకు కూడా తగినంత సమయం అవసరం. ఇంత తక్కువ టైంలో వాటన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడం మేకర్స్‌కు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ రూమర్లపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందా.. లేక గత అనుభవాల దృష్ట్యా సైలెంట్‌గా ఉండి రిలీజ్ డేట్‌ను మార్చుతారా అన్నది చూడాల్సి ఉంది.