Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!

Nandi Awards

Nandi Awards

తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది! ప్రతిష్టాత్మక ‘నంది’ అవార్డుల ప్రదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తూ. అమరావతి నుంచి తాజాగా వెలువడిన ఉత్తర్వులతో టాలీవుడ్‌తో పాటు బుల్లితెర, రంగస్థల కళాకారుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది పురస్కారాల విషయంలో ప్రభుత్వం వేగం పెంచి, ఏకంగా 2017 నుంచి 2025 వరకు.. అంటే తొమ్మిదేళ్ల కాలానికి సంబంధించిన అవార్డులను ఒకేసారి అందించేందుకు రంగం సిద్ధమైంది. సినిమా, టెలివిజన్, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కేవలం ప్రకటనతోనే సరిపెట్టకుండా, వచ్చే నెల అంటే డిసెంబర్‌లోనే నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంద,. ఈ ప్రతిష్టాత్మక వేడుకను విజయవాడలో గానీ, లేదా రాజధాని అమరావతిలో గానీ అట్టహాసంగా నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నంది అవార్డుల సందడి మళ్ళీ మొదలవుతుండటంతో, 2017 నుంచి 2025 మధ్య వచ్చిన ఏయే చిత్రాలు, ఏయే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ గౌరవాన్ని దక్కించుకుంటారనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. మొత్తానికి, డిసెంబర్‌లో తెలుగు కళాకారులందరికీ ఇదొక నిజమైన పండగ కాబోతోంది!