Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్

Anirudh

Anirudh

తెలుగు సినిమా సంగీతాన్ని కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఏలారు. ఏ పెద్ద సినిమా చూసినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండేవాళ్లు. అయితే దేవిశ్రీ హీరోగా మారటం వలనో ఏమో గాని, రాక్ స్టార్ హవా తగ్గింది. తమన్ బిజీగా ఉన్నా, టాప్ ప్లేస్ కి పోటీ ఇవ్వలేకపోతున్నాడు. ప్రెజెంట్ తెలుగులో మ్యూజిక్ సందడంతా ఆ తమిళ్ టెక్నీషియన్ దే.  హీరోల మధ్యనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా రెమ్యునరేషన్ వార్ నడుస్తుంది. ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే, మూడేళ్ల క్రితం వరకు రెహ్మాన్ అని చెప్పేవారు. ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైనా, ఇంతకాలం కేవలం బిజిఎం తో మాత్రమే క్రేజ్ ను కంటిన్యూ చేశారు. మ్యూజిక్ తో పాటు రెమ్యునరేషన్ పరంగా అనిరుధ్.. రెహ్మాన్ ను దాటేశాడు. వరుస మ్యూజికల్ హిట్స్ తో అనిరుధ్ అదరగొట్టేస్తున్నాడు. విక్రమ్ సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
తమిళ మ్యూజిక్ ప్రస్తుతం అనిరుధ్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు ఇది తెలుగు సినిమాలకు పాకింది. తమిళ తంబీలకే కాదు, తెలుగు హీరోలకు కూడా అనిరుధే కావాలి. ఫ్లాప్ మూవీ అజ్ఞాతవాసితో అనిరుధ్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ నిరాశపరిచినా, జెర్సీ సక్సెస్ అయింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ దేవరతో మరో ఆఫర్ ఇస్తే, చుట్టమల్లే అంటూ టాలీవుడ్ ను చుట్టేశాడు. రెహ్మాన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తుంటే, అనిరుధ్ మాత్రం 25 కోట్లు తీసుకున్నాడట. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసినా, అనిరుధ్ వెనకాలే పడుతున్నారు.
తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోనే ఉన్నాయి. 10, 15 కోట్లు తీసుకునే అనిరుధ్ కి తెలుగు మేకర్సే రెమ్యునరేషన్ పెంచేశారా అనిపిస్తుంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా అనిరుధ్ పేరే కనిపిస్తుంది. గాడ్ ఆఫ్ వార్ కథతో రూపొందే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ కోసం అనిరుధ్ నే తీసుకున్నారు. త్రివిక్రమ్ – అనిరుధ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా, తన తొలి పాన్ ఇండియా మూవీ కోసం సెంటిమెంట్ ని పక్కన పెట్టి అనిరుధ్ ని తీసుకున్నాడు గురూజీ. ఇక లోకేష్ కనకరాజ్ అయితే అనిరుధ్ ని తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడు. త్వరలో తీయబోయే అల్లు అర్జున్ మూవీకి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్.
నాని ప్యారడైజ్ నిరాశపరిచినా, అనిరుధ్ ఆల్బమే సినిమాకు హైప్ తీసుకొచ్చింది. గత మూడేళ్లుగా ప్రతి ఏడాది అనిరుధ్ చేతిలో 10 సినిమాలు ఉంటున్నాయి. టైం కి ట్యూన్స్, బిజిఎం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా, అనిరుధే కావాలంటున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలు క్రేజీ ఆఫర్స్ ఇచ్చి అనిరుధ్ రెమ్యునరేషన్ ని పాతిక కోట్లకు తీసుకువెళ్ళిపోయారన్న టాక్ నడుస్తోంది. లియో, జైలర్ 2 హిట్స్ తో అనిరుధ్ క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ మరింత పెరిగింది. రజినీకాంత్ హీరోగా కమల్ నిర్మించే ధర్మం సినిమాతో పాటు, నెల్సన్ దర్శకత్వంలో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించే క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా అనిరుధ్ ని తీసుకున్నారు. జవాన్ లో అనిరుధ్ వర్క్ ఇంప్రెస్ అయిన షారుక్, కింగ్ మూవీ కోసం ఏరికోరి అనిరుధ్ ని తీసుకున్నాడు. ఇంతమంది స్టార్స్ వెనకాల పడుతుంటే అనిరుధ్ రెమ్యునరేషన్ పాతిక కోట్లకు చేరింది. మరీ పెద్ద సినిమా అయితే 30 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నాడట.