వినాయక చవితి శుభపర్వదినం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్న “ధర్మవరం” సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఘనంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు.
ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ “ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది” అని తెలిపారు. “ధర్మవరం” సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.