బాలీవుడ్ రచయితల్లో మోస్ట్ పాప్యులర్ గా చెప్పుకోవాల్సిన పేర్లు సలీమ్ – జావేద్. వారిద్దరి ముందు కూడా హిందీ సినిమా రంగంలో చాలా మంది అద్భుతమైన రచయితలు ఉన్నారు. తరువాత కూడా ఇంకా ఎందరో కలం విదిలించి కదం తొక్కారు. అయితే, సలీమ్, జావేద్ ద్వయం మాత్రం బాలీవుడ్ సినిమాను ఓ కీలకమైన మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. వారి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని కమర్షియల్ గా షేక్ చేశాయి. అమితాబ్ లాంటి హీరోల్ని యాంగ్రీ యెంగ్ మెన్ గా ప్రేక్షకుల ముందు ఉంచాయి. అందుకే, సలీమ్, జావేద్ సినిమాలు బాలీవుడ్ చరిత్రతో విడదీయలేనంతగా పెనువేసుకుపోయాయి… దశాబ్దాల తరబడి హిందీ సినిమాను కమర్షియల్ గా కొత్త పుంతలు తొక్కించిన సలీమ్, జావేద్ గురించిన డాక్యుమెంటరీ త్వరలో తెరకెక్కబోతోంది. రూపొందిస్తున్నది ఎవరో కాదు… సలీమ్, జావేద్ వారసులే! సలీమ్ ఖాన్ తనయుడు సల్మాన్ ఖాన్.
జావేద్ అఖ్తర్ వారసులు ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్. ఈ ముగ్గురూ ఇప్పుడు తమ నిర్మాణ సంస్థల ద్వారా ‘యాంగ్రీ యంగ్ మెన్’ అనే పేరుతో సలీమ్, జావేద్ సినీ ప్రస్థానాన్ని డాక్యుమెంటరీగా రూపొందించబోతున్నారు. జోయా అఖ్తర్ ప్రధానంగా డాక్యుమెంటరీపై రెండు నెలలుగా పని చేస్తోందని సమాచారం. సలీమ్, జావేద్ డాక్యుమెంటరీ ‘యాంగ్రీ యంగ్ మెన్’లో ఇద్దరు స్టార్ రైటర్స్ కలయిక, ‘షోలే, జంజీర్, దీవార్’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ కి వారు చేసిన వర్క్, అప్పటి జ్ఞాపకాలు, అనుభవాల వంటివి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతే కాదు, సలీమ్, జావేద్ ఎందుకు విడిపోయారనేది కూడా డాక్యుమెంటరీలో చర్చించనున్నారు! వచ్చే సంవత్సరం ఏదో ఒక ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ‘యాంగ్రీ యంగ్ మెన్’ విడుదల కానుంది…